Saturday, 7 November 2015

అమెరికాలో... ఆసియా ఖండం నుంచి అత్యధిక మంది ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు భారత దేశానికి చెందిన వారే ఉన్నారు. ఆసియా ఖండంలో మనమే టాప్‌లో ఉన్నాం. అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌కు చెందిన సైన్స్, ఇంజినీరింగ్ గణాంకాల జాతీయ కేంద్రం నివేదికలో ఇది వెల్లడైంది. ఆసియా నుంచి మొత్తం 29.6 లక్షల మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు అమెరికాకు వెళ్తుండగా అందులో భారతీయుల సంఖ్య 9,5 లక్షలు. 2003తో పోలిస్తే భారత్‌ నుంచి వస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల సంఖ్య 2013లో 85శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. ఫిలిప్పీన్స్‌ నుంచి ఈ పెరుగుదల 53 శాతం. హాంకాంగ్‌, మకావూతో కలిపి చైనా నుంచి ఈ పెరుగుదల 34 శాతం. 2003 నుంచి 2013 వరకు అమెరికాలో నివసిస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల సంఖ్య 2.16 కోట్ల నుంచి 2.9 కోట్లకు పెరిగింది. అదే కాలంలో వలస వచ్చిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల సంఖ్య 34 లక్షల నుంచి 52 లక్షలకు పెరిగింది. 2013 గణాంకాల ప్రకారం అమెరికాలోని వలస శాస్త్రవేత్తలు, ఇంజినీర్లలో 63 శాతం మందికి పూర్తిస్థాయి పౌరసత్వం ఉంది. 22శాతం మంది శాశ్వతంగా ఉంటున్నారు. 15శాతం మంది తాత్కాలిక వీసాదారులు. వలస శాస్త్రవేత్తలు, ఇంజినీర్లలో 57శాతం మంది ఆసియాలో జన్మించినవారు. 20శాతం మంది ఉత్తర అమెరికా (అమెరికా మినహాయించి), మధ్య అమెరికా, కరేబియన్‌, దక్షిణ అమెరికాలో జన్మించిన వారు. 16శాతం మంది ఐరోపాలో, 6 శాతం మంది ఆఫ్రికాలో, ఒకశాతం కన్నా తక్కువ మంది ఓషనియాలో జన్మించినవారు. వలస శాస్త్రవేత్తల్లో 32 శాతం మంది తమ అత్యున్నత డిగ్రీ మాస్టర్స్‌ అని, 9శాతం మంది డాక్టరేట్‌ చేశామని వెల్లడించారు. అమెరికాలో జన్మించిన శాస్త్రవేత్తల్లో ఇది వరుసగా 29 శాతం, నాలుగు శాతంగా ఉంది. 2003-2013 మధ్య కాలంలో జీవశాస్త్ర రంగం, గణితశాస్త్రం, సామాజిక శాస్త్రవేత్త వృత్తుల్లో వలస ఉపాధికి సంబంధించిన వృద్ధి గణనీయంగా ఉంది. 2013లో 80శాతం మందికి పైగా వలస శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు ఉద్యోగం లభించింది. అమెరికాలో జన్మించిన వారి విషయంలోనూ ఇంతే శాతం నమోదయింది. సైన్స్‌, ఇంజినీరింగ్‌ రంగాల్లోని వలస ఉద్యోగుల్లో 18శాతం మంది కంప్యూటర్‌, గణిత శాస్త్ర రంగాల్లో పని చేస్తున్నారు. 8 శాతం మంది ఇంజినీరింగ్‌ రంగంలో పని చేస్తున్నారు.
స్టార్టప్‌‌లు భవిష్యత్‌ భారతానికి నూతన ముఖ చిత్రమని టాటా గ్రూపు సంస్థల మాజీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గురువారం అభివర్ణించారు. భారతదేశ సత్తాను చాటేందుకు త్రికరణ శుద్ధిగా పని చేసేందుకు యువత సిద్ధం కావాలన్నారు. ఉత్తమ ఆలోచనలకు టీ-హబ్‌ సరైన వేదికగా నిలుస్తుందని చెప్పారు. హైదరాబాద్‌ ఐఐఐటీ ఆవరణలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన అతిపెద్ద ఇంక్యూబేటర్‌ టీ-హబ్‌ను గవర్నర్‌ నరసింహన్‌తో కలసి రతన్ టాటా ప్రారంభించారు. అనంతరం రతన్ టాటా మాట్లాడారు. దేశంలో వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన స్టార్టప్‌లకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. బయో టెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్‌, స్టెమ్‌సెల్‌ వంటి వాటిపై పరిశోధనలు అత్యంత కీలకమన్నారు. మొండి వ్యాధులను నయంచేసే ఆవిష్కరణల అవసరం చాలా ఉందన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చినంత మాత్రాన పాతవి నిరర్థకం కాబోవని, నవభారత నిర్మాణ కలలు సాకారమయ్యేందుకు యువ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు దోహదపడాలని, అందుకు నిరంతర ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్, సిఎస్ రాజీవ్ శర్మ, నాస్కాం చైర్మన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Thursday, 5 November 2015

వరంగల్ ఉపఎన్నిక

వరంగల్ ఉపఎన్నికకు నామినేషన్ల గడువు పూర్తయిన నేపథ్యంలో అధికారులు ఈరోజు నామినేషన్లను పరిశీలించారు. మొత్తం 38 నామినేషన్లు రాగా అందులో కాంగ్రెస్ అభ్యర్ధి రాజయ్యతోపాటు ఇంకా స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన తొమ్మిది అప్లికేషన్‌లను అధికారులు తిరస్కరించారు. కాగా వరంగల్ ఉపఎన్నికకు టీఆర్ ఎస్ పార్టీ నుండి పసునూరి దయాకర్ రావు, వైసీపీ పార్టీ నుండి నల్లా సూర్యప్రకాశరావు, బీజేపీ-టీడీపీ నుండి దేవయ్య, కాంగ్రెస్ పార్టీనుండి సర్వే సత్యనారాయణ బరిలో దిగనున్నారు.
భారత్ పేద దేశం ఎలా అవుతుంది-మోడీ
భారతదేశం పేద దేశం కాదని ప్రధాని మోడీ అబిప్రాయపడ్డారు.దేశంలో ఇరవైవేల టన్నుల బంగారం ఉందని, అలాంటి దేశం పేద దేశం అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. బంగారం డిపాజిట్ ,బాండ్ల స్కీమ్ ను ఆయన ప్రారంబించారు. దీని ద్వారా ప్రజలు నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు.ఇళ్లలో బంగారం దాచుకుంటే భద్రత ఉండదని, అదే బాండ్ల రూపంలో ఉంచుకుంటే ఆదాయం వస్తుందని,అలాగే భద్రత ఉంటుందని మోడీ అన్నారు.బాండ్లను ఎవరైనా దొంగిలించానా ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. మహిళల పేరుతో ఆస్తుల రిజిస్ట్రేషన్ జరగాలని ఆయన అన్నారు.
టి.హబ్ ను మెచ్చుకున్న గవర్నర్
తెలంగాణ ఐటి హబ్ ను ఆరంభించిన ప్రభుత్వాన్ని గవర్నర్ నరసింహన్ మెచ్చుకున్నారు.పదిహేడు నెలల వ్యవధిలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి మెచ్చుకోదగిందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో టి.హబ్ ను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆరంభించిన సందర్బంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు.ఈ ఐటి హబ్ లో స్టార్ట్ అప్ సంస్థలకు అవకాశం కల్పిస్తారు. వ్యవసాయం,ఆరోగ్య సంరక్షణ, రోబోటిక్స్ తదితర రంగాలలో కృషి చేసే వారికి ఇందులో అవకాశం ఇస్తారు. తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ ఆద్వర్యంలో వేగంగా ఈ భవనాన్ని నలభై కోట్ల వ్యయం తో పూర్తి చేశారు

LOGO


మామ రాజయ్య మాట విని తిరిగి వరంగల్‌కు అనిల్ కుమార్‌తో సంసారం చేయడానికి రావడమే సారిక చేసిన పెద్ద తప్పా అనే సంశయం కలుగుతోంది. జరిగిన విషాద ఘటన చూసిన తర్వాత రెండోసారి ఆమె వరంగల్‌కు రాకుండా తన ఉద్యోగం తాను చేసుకుంటూ బతికి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనే మాట వినిపిస్తోంది. తనకు భర్త వేధింపులు ఎక్కువకావడంతో సారిక 2014లో బేగంపేటలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో అత్త, మామ, భర్త, వివాహేతర సంబంధం నెరుపుతున్న సనాపై పోలీసులకు సారిక ఫిర్యాదు చేసింది. వీరిపై 498/ఏ సెక్షన్ కింద కేసు నమోదైంది. అయితే, విచారణ తర్వాత ఎస్.రాజయ్యకు సంబంధం లేదని ఆయన పేరు తొలగించారు.   అప్పుడు ఎంపీగా ఉన్న రాజయ్య కోడలుకు సర్దిచెప్పి రాజీ కుదిర్చి హన్మకొండలోని ఇంటికి వచ్చారు. కొద్దిరోజుల పాటు వీరి సంసారం బాగానే ఉంది. ఈ సమయంలోనే సారిక గర్భం దాల్చి కవల పిల్లలు శ్రీయోన్ - అయోన్‌లకు జన్మనిచ్చింది. తాను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత రాజయ్య తన తనయుడు అనిల్ కుమార్‌ను తన వారసునిగా క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్న క్రమంలోనే భర్త అనిల్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకుని సారిక పలుమార్లు భర్తను హెచ్చరించింది. అయితే ఫలితం దక్కలేదు. వరంగల్ వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య మళ్లీ కలహాలు చెలరేగాయి. దీంతో సారిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెద్దలు నచ్చజెప్పడంతో ఉద్యోగం మానేసి, ఇంటిపట్టునే ఉంటూ వచ్చింది. వరంగల్ రెవెన్యూ కాలనీలోని ఇంటిని కొడుకు, కోడలుకు వదిలేసి రాజయ్య దంపతులు వేరేచోట ఉంటున్నారు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా సారిక, అనిల్ వేర్వేరు గదుల్లో నివసించేవారు. దీనికితోడు తనను వివాహం చేసుకోవాలంటూ సనా ఒత్తిడి తేవడంతో అనిల్ మరింత ఒత్తిడికి గురయ్యాడు. ఈ ఒత్తిడితో భార్య సారికతో గొడవపడుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ దక్కడంతో రాజయ్య సెంటిమెంట్‌గా భావించే సారిక ఉంటున్న ఇంటికిమారాడు. బుధవారం రెండోసారి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతుండగానే తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరగడం విషాదాన్ని నింపింది. సారిక స్వస్థలం. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామం. తల్లిదండ్రులు వంగల లలిత, శ్రీనివాసాచారి. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. శ్రీనివాసాచారి పంచాయతీరాజ్‌శాఖలో పనిచేసి పదవీ విరమణపొందారు. పెద్ద కుమార్తె పేరు అర్చన. ఎంకాం పట్టభద్రురాలు. మూడో కూతురు దీపిక డిగ్రీ పూర్తిచేశారు. రెండో కూతురైన సారిక కామారెడ్డిలో ఇంటర్మీడియట్ వరకు చదివింది.