స్టార్టప్‌లు భవిష్యత్ భారతానికి నూతన ముఖ చిత్రమని టాటా గ్రూపు సంస్థల మాజీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గురువారం అభివర్ణించారు. భారతదేశ సత్తాను చాటేందుకు త్రికరణ శుద్ధిగా పని చేసేందుకు యువత సిద్ధం కావాలన్నారు. ఉత్తమ ఆలోచనలకు టీ-హబ్ సరైన వేదికగా నిలుస్తుందని చెప్పారు. హైదరాబాద్ ఐఐఐటీ ఆవరణలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన అతిపెద్ద ఇంక్యూబేటర్ టీ-హబ్‌ను గవర్నర్ నరసింహన్‌తో కలసి రతన్ టాటా ప్రారంభించారు. అనంతరం రతన్ టాటా మాట్లాడారు. దేశంలో వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన స్టార్టప్‌లకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. బయో టెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్, స్టెమ్‌సెల్ వంటి వాటిపై పరిశోధనలు అత్యంత కీలకమన్నారు. మొండి వ్యాధులను నయంచేసే ఆవిష్కరణల అవసరం చాలా ఉందన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చినంత మాత్రాన పాతవి నిరర్థకం కాబోవని, నవభారత నిర్మాణ కలలు సాకారమయ్యేందుకు యువ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు దోహదపడాలని, అందుకు నిరంతర ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్, సిఎస్ రాజీవ్ శర్మ, నాస్కాం చైర్మన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment